27, మే 2021, గురువారం

పదునాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


పదునాఱవ పద్యము:

చంపకమాల:
విన, రయ రాహుతా! పృథివి విష్ణుయశుండను విప్రుపుత్ర! శూ
ర! నుతులివే! వెసన్, బుధుల రక్షగఁ, గష్టముఁ బోనడంచియున్,
జన జయముల్ గనన్, ఖలుల సంఖ్య యజమ్మునఁ గాల్చె దీవె కా
మన లమరన్! నతుల్ ఘన! రమావర! నందక! కల్కి! కేశవా! 16

గర్భిత కందము:
రయ రాహుతా! పృథివి వి
ష్ణుయశుండను విప్రుపుత్ర! శూర! నుతులివే!
జయముల్ గనన్, ఖలుల సం
ఖ్య యజమ్మునఁ గాల్చె దీవె కామన లమరన్! 16

గర్భిత తేటగీతి:
పృథివి విష్ణుయశుండను విప్రుపుత్ర!
బుధుల రక్షగఁ, గష్టముఁ బోనడంచి,
ఖలుల సంఖ్య యజమ్మునఁ గాల్చె దీవె!
ఘన! రమావర! నందక! కల్కి! కేశ! 16


స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి