6, ఆగస్టు 2021, శుక్రవారం

నూటరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నూటరెండవ పద్యము:

చంపకమాల:
శ్రమ నకలంకుఁడై పరఁగ రత్నకుఁ డూను తపః ప్రదీప్త నా
గము పయినన్ మము న్నెపుడుఁ గాచెడు రత్నగిరీశ! దేవ! శ్రే
యము వికసింప, నే విసుగు నందక, యన్నవరేశ! సత్య! నా
ణ్యము లిడెదే! హరీ! దయల నందఁగఁ జేసెదె! తార్క్ష్య! కేశవా! 102

గర్భిత కందము:
అకలంకుఁడై పరఁగ ర
త్నకుఁ డూను తపః ప్రదీప్త నాగము పయినన్
వికసింప, నే విసుగు నం
దక, యన్నవరేశ! సత్య! నాణ్యము లిడెదే! 102

గర్భిత తేటగీతి:
పరఁగ రత్నకుఁ డూను తపః ప్రదీప్త!
యెపుడుఁ గాచెడు రత్నగిరీశ! దేవ!
విసుగు నందక, యన్నవరేశ! సత్య!
దయల నందఁగఁ జేసెదె! తార్క్ష్య! కేశ! 102



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి