ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నూటయెనిమిదవ పద్యము:
చంపకమాల:
స్థిత మతి జోడ్చియుం, గడిఁది శ్రేష్ఠత నిచ్చియుఁ, గావుమయ్య సౌ
మ్యత, గురుతం; గడుం బొసఁగ, మాన్యతఁ గూర్చియుఁ బ్రోవుమయ్య; గ
ణ్యత ధృత ప్రేమ, నా శతక మంకితముం గొని, శాంతిఁ బెంచి, కృ
ష్ణ! తనుపవే! హరీ! తనర సంబర మీయవె! తార్క్ష్య! కేశవా! 108
గర్భిత కందము:
మతి జోడ్చియుం, గడిఁది శ్రే
ష్ఠత నిచ్చియుఁ, గావుమయ్య సౌమ్యత, గురుతన్;
ధృత ప్రేమ, నా శతక మం
కితముం గొని, శాంతిఁ బెంచి, కృష్ణ! తనుపవే! 108
గర్భిత తేటగీతి:
కడిఁది శ్రేష్ఠత నిచ్చియుఁ, గావుమయ్య!
పొసఁగ, మాన్యతఁ గూర్చియుఁ బ్రోవుమయ్య!
శతక మంకితముం గొని, శాంతిఁ బెంచి,
తనర సంబర మీయవె! తార్క్ష్య! కేశ! 108
ఇది శ్రీమద్వాసుదేవకరుణాకటాక్షవీక్షణావాప్తకవితావిశేష శ్రీమద్గుండువంశపయోవారాశిపూర్ణచంద్ర మల్లికాంబా రామస్వామి సత్పుత్ర త్రిలింగభాషావిద్వత్కవివిధేయ మధురకవి బిరుదాంచిత మధుసూదన నామధేయ విరచిత శ్రీకేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము సర్వము సమాప్తము
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు