13, జులై 2021, మంగళవారం

అఱువదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


అఱువదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
స్వయ మిలఁ బాపియౌ నెఱి నజామిళు చెంతఁ గనిష్ఠు నుంప, మే
రయ తలఁగన్, దనన్ యము తలారులె "ర"మ్మని యాగమింప, నా
రయఁ బిలువన్ సుతున్, "హరిని రాగిలి, పిల్చె" నటంచు నిత్తె, కృ
ష్ణ! యభవమున్! హరీ! ముగితి చాయనుఁ జేర్చితె, పూజ్య! కేశవా! 69

గర్భిత కందము:
ఇలఁ బాపియౌ నెఱి నజా
మిళు చెంతఁ గనిష్ఠు నుంప, మేరయ తలఁగన్,
బిలువన్ సుతున్, "హరిని రా
గిలి, పిల్చె" నటంచు నిత్తె, కృష్ణ! యభవమున్! 69

గర్భిత తేటగీతి:
నెఱి నజామిళు చెంతఁ గనిష్ఠు నుంప,
యము తలారులె "ర"మ్మని యాగమింప,
"హరిని రాగిలి, పిల్చె" నటంచు నిత్తె,
ముగితి చాయనుఁ జేర్చితె, పూజ్య! కేశ! 69



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి